Hosea 7

1నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది.

షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి.

వారు మోసం అభ్యాసం చేస్తారు.

దొంగతనానికి చొరబడతారు.

బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.

2తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ,

అవి నా ఎదుటనే జరిగినప్పటికీ,

వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు.

3వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.

4వారంతా కాముకులే.

రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత,

ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి,

ఊరుకున్నట్టు వారంతా కాముకులే.

5మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు.

రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.

6పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు.

వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది.

ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది.

7వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు.

తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు.

వారి రాజులంతా కూలిపోయారు.

నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.

8ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు.

ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.

9పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు.

తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.

10ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది.

ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవాా వైపు తిరుగడం లేదు.

ఆయనను వెదకడం లేదు.

11ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండె గల గువ్వ అయిపోయింది.

అది ఐగుప్తీయులను పిలుస్తుంది.

తరువాత అష్షూరీయుల దగ్గరకు ఎగిరిపోతుంది.

12వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను.

పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను.

వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను.

13వారికి బాధ!

వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు.

వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది.

వారు నా మీద తిరుగుబాటు చేశారు.

వారిని రక్షించేవాడినే.

కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.

14హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ,

మంచాల మీద పడుకుని అక్రోశిస్తారు.

ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు.

కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు.

15నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు.

వారు తిరిగి వస్తారు గానీ,

సర్వోన్నతుడి వైపుకు తిరగరు.

వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు.

వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు.

ఇది వారి పాలిట ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతుంది.

16

Copyright information for TelULB